Gurupatwant Singh Murder Plot: భారత్ నుంచి జవాబుదారీతనాన్ని ఆశిస్తున్నాం.. సిక్కు వేర్పాటువాది హత్యకు కుట్రపై అమెరికా

  • అమెరికాలో సిక్కు వేర్పాటు వాది హత్యకు కుట్ర వెనుక భారత 'రా' అధికారులు
  • వాషింగ్టన్ పోస్టు కథనంతో ఒక్కసారిగా కలకలం 
  • అమెరికా పత్రిక కథనాన్ని ఊహాజనితంగా తోసిపుచ్చిన భారత్
  • ఈ కథనంపై అమెరికా స్పందన, భారత్ నుంచి జవాబుదారీతనాన్ని ఆశిస్తున్నట్టు ప్రకటన
Expect accountability from India US reacts to Washington Post article on Pannun murder plot

అమెరికాలో సిక్కు వేర్పాటు వాది గురుపత్వంత్ సింగ్ పన్నున్‌ హత్యకు కుట్రల వెనక భారత నిఘా సంస్థ రా అధికారుల హస్తం ఉందంటూ వాషింగ్టన్ పోస్టు పత్రిక ప్రచురించిన కథనం సంచలనంగా మారింది. అయితే, ఈ ఉదంతంపై అమెరికా తాజాగా స్పందించింది. ఈ విషయంలో భారత్ నుంచి బాధ్యతాయుత వైఖరిని ఆశిస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వేదాంత్ పటేల్ మంగళవారం పత్రికా సమావేశంలో పేర్కొన్నారు. ‘‘ఈ అంశాన్ని మేము భారత దేశ ఉన్నతాధికారుల దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళుతున్నాం. ఈ విషయమై ఇండియా ఏర్పాటు చేసిన కమిటీతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నాం’’ అని ఆయన అన్నారు. 

అమెరికాలో గురుపత్వంత్ సింగ్ పన్ను హత్యకు కుట్ర గురించి ప్రధాని మోదీకి అత్యంత దగ్గరైన వారికి తెలుసునని కూడా వాషింగ్టన్ పోస్టు పేర్కొంది. 

మరోవైపు, వాషింగ్టన్ పోస్టు వార్తా కథనంపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఆ కథనం ఊహాజనితమని, బాధ్యతారహితమని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఆ కథనంలో అనేక అనవసర, నిరాధార ఆరోపణలు ఉన్నాయని మంగళవారం తెలిపారు. అంతేకాకుండా, అమెరికాలో క్రిమినల్స్‌కు సంబంధించి ఆ దేశం లేవనెత్తిన అంశాలపై దృష్టి సారించేందుకు ఓ ఉన్నతస్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు జైశ్వాల్ తెలిపారు. 

గురుపత్వంత్ సింగ్ పన్నున్.. సిక్కు వేర్పాటు వాద సిక్స్ ఫర్ జస్టిస్‌ సంస్థలో ముఖ్యనేతగా ఉన్నారు. స్వతంత్ర సిక్కు దేశం కోసం పోరాడుతున్న ఈ సంస్థకు పన్నున్ న్యాయసలహాదారుగా, అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. కాగా, పన్నున్‌ను ప్రభుత్వం గతంలోనే తీవ్రవాదిగా ప్రకటించింది. సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థపై కూడా నిషేధం విధించింది.

  • Loading...

More Telugu News